ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌వి విష‌యంలో సొంత పార్టీ నేత‌ల‌పై గ‌రం అవుతున్నారు.

By Medi Samrat
Published on : 11 Aug 2025 2:38 PM IST

ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌వి విష‌యంలో సొంత పార్టీ నేత‌ల‌పై గ‌రం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎక్స్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పేప‌ర్ క్లిప్ ఒక‌టి షేర్ చేశారు. అందులో ఆయ‌న‌ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఆయ‌న పోస్టులో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకుంటూ, అవ‌మానిస్తున్న‌ వాస్త‌వాన్ని మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధ‌న్య‌వాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నారు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నాను అంటూ ఓ ప‌త్రిక‌లో ప్రచురితమైన వార్త ను తన ఎక్స్ పోస్ట్ కు రాజగోపాల్ జత చేశారు.

ఇదిలావుంటే.. నిన్న ఓ ఇంటర్వ్యూలో భ‌ట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ రాజకీయంగా తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి పదవి ఇస్తామని రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది వాస్తవమేనని ధృవీకరిస్తూ ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి స్పష్టంగా ఇంటర్వ్యూలో చెప్పారు.

Next Story