Video : ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేము ఇద్దరన్నదమ్ములం ఉన్నామని.?
మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు.
By Medi Samrat
మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనన్నారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా.. మీరు మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ.. అప్పటివరకూ మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని విజ్క్షప్తి చేశారు.
ఇస్తామన్నమాట ఆలస్యమైంది.. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు.. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు.? ఎవరడ్డుకుంటున్నారు రాకుండా.? నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా..? మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని...? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా.? మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని.. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది అని ఫైర్ అయ్యారు.
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు.. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అని ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ములం అంటున్నారు.. ఇద్దరం సమర్థులమే., ఇద్దరం గట్టి వాళ్లమే.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా.. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు.
భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను.. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను.. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానకుపోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి పేదవాళ్లకు అండగా ఉండాలని నేను కష్టపడుతున్నా.. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా.. మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదన్నారు.