జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం తొందర పాటు చర్య అని మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండాలని చివరి వరకూ ప్రయత్నం చేసారన్నారు. తర్వాత విడతలో రాజ్యసభ ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని.. ఓపికగా ఉండకుండా బీఆర్ఎస్‌లో చేరి జీవన్ రెడ్డి ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ సీనియర్ నేతగా ఎంతో సేవ చేశారని.. పార్టీ వీడటం బాధాకరమన్నారు.
ఖైరతాబాద్ పెద్ద గణేష్ వద్ద 99రోజుల ప్రజా పాలనలో భాగంగా "ఫ్రైడే డ్రైడే" పేరిట జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రియాంక తో కలిసి ర్యాలీలో పాల్గొన్న దానం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దానం నాగేందర్ అన్నారు. పబ్లిసిటీ కోసం దోమతెరలు వేసుకొని బయట తిరుగుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.