ప్రధాని మోదీ అసమర్థ పాలనలో దేశం ముందుకు సాగుతోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సీఎంగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్)కు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ చేసిన సూచనలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని సుమన్ విమర్శించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకుంటున్నారని అన్నారు.
బీజేపీ పాలన నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు టీఆర్‌ఎస్ అధినేత మరోసారి ఉద్యమించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు టీఆర్‌ఎస్ కేడర్ మొత్తం మద్దతు ఇస్తుందని, తెలంగాణ రాష్ట్ర సామాజిక సంక్షేమ పథకాలను యావత్ దేశం మొత్తం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన హామీ ఇచ్చారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, 8 ఏళ్లలో తెలంగాణలో ఎనలేని ప్రగతి జరిగిందని, ఇదే అభివృద్ధి దేశమంతా విస్తరించాలని అన్నారు.
దేశంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకుండా, అన్ని వర్గాలను నట్టేటా ముంచుతూ రాక్షస పాలనను బీజేపీ కేంద్రంలో కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రభుత్వం సంస్థలను బీజేపీ ధ్వంసం చేస్తోందన్నారు. దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేలా.. దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోందన్నారు. కాగా.. హైదరాబాద్ నుంచి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 11న కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిని కలిసిన తర్వాత కొత్త జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తాం అని అన్నారు.