బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అధికారం పోయాక వినోద్ రావు ఇప్పుడు సుద్దపూస లా మాట్లాడుతున్నాడనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
By Medi Samrat Published on 19 March 2024 5:31 PM ISTఅధికారం పోయాక వినోద్ రావు ఇప్పుడు సుద్దపూస లా మాట్లాడుతున్నాడనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.. మంగళవారం కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేత వినోద్ రావు పార్టీ ఫిరాయింపులపై నంగనాచి కబుర్లు చెబుతున్నాడనీ అన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ విచ్చలవిడిగా ఎమ్మెల్యే లను ప్రలోభ పెట్టినప్పుడు వినోద్ రావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు సన్నిహితుడైన వినోద్ రావుకు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేకమని తెలియదా.. అప్పుడు ఆయనకెందుకు చెప్పలేదని అడిగారు.
న్యాయవాది కూడా అయిన వినోద్ రావుకు రాజ్యాంగం గురించి పదేళ్ల లో తెలియరాలేదన్నారు. అనర్హత పిటిషన్ లపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని గత స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కి వినోద్ రావు ఎందుకు సలహా ఇవ్వలేదని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు అనర్హత పిటిషన్లపైన స్పీకర్లు తేల్చకపోతే ఆయన కనీసం ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు నిలదీయలేదనీ, కాంగ్రెస్ పార్టీకి నీతులు చెబుతున్న వినోద్ రావు కేసీఆర్ కు ఆ నీతులు ఎందుకు చెప్పలేదు అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను వినోద్ రావు ఎందుకు ఖండించలేదనీ.. కేటీఆర్, కడియం శ్రీహరి లాంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తమరు ఏం చేశారని ప్రశ్నించారు. లోపల కుట్రలు చేస్తు బయటకు వినోద్ రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నాడని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంపైన కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో కేటీఆర్,హరీష్ రావు మాదిరి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మేం ప్రలోభ పెట్టడం లేదనీ, కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం ఇష్టం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ కథ ముగిసిందని వారికి అర్థమైంది.. ఎంపీ ఎన్నికల తర్వాత మీ పార్టీ కనిపించదని, కరీంనగర్ లో ప్రజాబలంతో గెలవలేమని వినోద్ రావు డబ్బు సంచులు దింపారనీ డబ్బులు పట్టుబడటంతో నాకేం సంబంధమని బుకాయిస్తున్నాడనీ, ప్రతిమ మల్టీ ఫ్లెక్స్ లో దొరికిన డబ్బు తో నాకేం సంబంధం లేదని వేములవాడ రాజన్న చెంత ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. వినోద్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అన్నారు.