ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఏ ఒక్కరూ మనో ధైర్యం కోల్పోవొద్దు : మంత్రి ఉత్తమ్

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో దెబ్బతిన్న చెరువులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి త్వరితగతిన పునరుద్దరిస్తామని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు

By Medi Samrat  Published on  3 Sept 2024 8:00 PM IST
ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఏ ఒక్కరూ మనో ధైర్యం కోల్పోవొద్దు : మంత్రి ఉత్తమ్

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో దెబ్బతిన్న చెరువులను యుద్దప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి త్వరితగతిన పునరుద్దరిస్తామని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలతో హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోనీ హుజుర్నగర్, మఠంపల్లి మండలపరిధిలో గండ్లు పడిన చేరువులను, దెబ్బతిన్న కాలువలను, ముంపుకు గురైన పంట పొలాలతో పాటు కూలిపోయిన ఇండ్లను ఆయన సందర్శించారు. హుజుర్ న‌గర్ పట్టణంలోనీ దద్దినాల చెరువుతో పాటు బురుగ్గడ్డ గ్రామంలోనీ నల్లచెరువును ఆయన సందర్శించారు.

రాష్ట్రం మొత్తం మీద అత్యధిక వర్ష పాతం నమోదు అయింది హుజుర్నగర్ నియోజకవర్గం లోనేనని ఆయన పేర్కొన్నారు. హుజుర్నగర్ పురపాలక సంఘము పరిధిలో కొట్టుక పోయిన డ్రైనేజీలు, రహదారుల ను ఆయన మంగళవారం సందర్శించారు. నల్లచేరువుకు గండిపడడంతో అక్కడ ముంపునకు గురైన పొలాలను, ఇసుక మెటలతో, మట్టిదిబ్బలతో, రాళ్లు రప్పలతో నిండి పోయిన పంట పొలాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. దానితో పాటు మఠంపల్లి మండల పరిధిలోని చౌటపల్లి, మఠంపల్లి మండల కేంద్రం, రఘునాధపాలెం, గుండ్లపల్లి, చెన్నాయిపాలెం గ్రామాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడి గాలి పర్యటన నిర్వహించారు.

చెరువులు,కాలువల మీద కాలి నడకన కలియ తిరుగుతూ.. రైతాంగాన్నీ ఓదారుస్తూ.. ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ.. ప్రయాణానికి అనువుగాని ప్రాంతాలకు ట్రాక్టర్ మీద పయనిస్తూ రెండు మండలాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు.

అనంతరం ఆయన మఠంపల్లి మండలం గుండ్లపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలకు ముంపుకు గురైన పంటపొలాలకు ఎకరాకు పదివేల రూపాయల నష్ట పరిహారం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా సంభవించిన వర్షపు ఉధృతికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు పది వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు ఇందిరమ్మ పథ‌కంలో బాగంగా పక్కా గృహాలు నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అదేవిదంగా ఇదే బీభత్సానికి మరణించిన ఒక్కో పశువుకు 50 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇదని, నష్ట పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఏ ఒక్కరూ మనోధైర్యం కోల్పోరాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు ఉద్బోధించారు.

Next Story