తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో చుక్కనీరు వదులుకునే ప్రసక్తే లేదు: ఉత్తమ్
జలసౌధలో న్యాయనిపుణులు,నీటిపారుదల రంగ నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: సెప్టెంబర్ 23న జరగనున్న కృష్ణా జలాల వివాద-2 విచారణలో తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణాకు చెందాల్సిన నీటివాటలో చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తేలేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ నెల 23 నుండి 25 వరకు దేశరాజధాని ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొన బోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో 23 నుండి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 విచారణలో తెలంగాణా ప్రభుత్వం అనుసరించాల్సిన అంశంపై శనివారం రోజున ఆయన నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయం జలసౌధలో న్యాయనిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్ వైద్యనాధ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని ఆయన వెల్లడించారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణా రాష్ట్ర వాటాను సాధించేందుకు బలమైన వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని వారు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయవాదులు తెలంగాణా రాష్ట్రానికి చెందాల్సిన నీటివాటపై వాదనలు వినిపించ నున్నారని ఆయన పేర్కొన్నారు. KWDT ఎదుట 2025 ఫిబ్రవరి నుండి వాదనలు కొనసాగుతున్నాయని,సమైక్యాంధ్రలో తెలంగాణా ప్రాంతానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించారని ఆయన తెలిపారు. శాస్త్రియంగా నీటి కేటాయింపులు, ఆంద్రప్రదేశ్ చేపట్టిన అనధికార బేసిన్ ల వివరాలు,తెలంగాణా ప్రాంతంలో సాగునీటి అవసరాలు అందులో పొందు పరచరన్నారు. ఎప్పటికప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాలువల సామర్ధ్యాలను పెంచుకుంటూ గోదావరి,పట్టిసీమ,చింతలపూడి,పులిచింతల నీరు అక్రమంగా తరలించుకు పోతున్న అంశాలను ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు. 1956 జలవివాద చట్టం,2014 ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించామన్నారు. 811 టి.యం.సి ల కృష్ణా జలాశయాలలో తెలంగాణా ప్రాంతానికి 71 శాతం కేటాయింపులు ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.ఇక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందే నన్నారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని అందుకు అనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రిబ్యునల్ కు సమర్పించా మని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని ఆయన పునరుద్ఘాటించారు.
ఇప్పటికే ట్రిబ్యునల్ ఎదుట వాదనలు పూర్తిగా వినిపించగా తాజాగా అధికారులు అందిస్తున్న నివేదికల ప్రకారం జూన్,జులై మాసాలలో ఇక్కడికి అవసరమైన నీటి కోసం 80 టి.యం.సి ల నీటిని అందుబాటులో ఉంచేలా వాదనలు విపించడంతో పాటు ఆపరేషన్ ఫ్రొటో కాల్ నిబంధనల ననుసరించి మిగిలిన నీటిని వినియోగించుకునే స్వేచ్ఛ తెలంగాణాకు ఉండేలా ట్రిబ్యునల్ ముందట ఉంచుతామన్నారు. ఐ.ఎస్.ఆర్.డబ్ల్యు.డి చట్టం లోని సెక్షన్ 4(1) ఏ. తో పాటు పునర్వ్యవస్థీకరణ చట్టం లోని పదకొండో షెడ్యూల్ పదో పేరాగ్రాఫ్ వంటి న్యాయపరమైన అంశాలను కుడా ఈ విచారణలో వాదించబోతున్నట్లు ఆయన వివరించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా వినియోగిస్తున్న 291 టి.యం.సి ల నీటి ఉదంతం వెలుగులోకి వచ్చినందున ఆ నీటిని పునర్విభజన చేయాల్సిందే నని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, నదుల నిర్వహణ బోర్డు ల ఎదుట ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా లో కడుతున్న ప్రాజెక్టులపై అడ్డుపడుతుండడంతో ఒకింత ఆలస్యం జరుగుతొందని ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై తెలంగాణా కు ఉన్న హక్కులను కుడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలలో వినిపిస్తామన్నారు. తమ వాదనలకు బలం చేకూరేలా ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణాల అంశాలతో కూడిన ప్రత్యేక జీ.ఓ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నదమౌతుందన్నారు.
వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాల సామర్ధ్యం పెంపుతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం త్రాగునీటి అవసరాల కోసం కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లు,100 టి.యం.సి లను మళ్లించడానికి వీలుగా రూపకల్పన చేసిన జూరాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ లు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు తెలంగాణా ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయక పోవడం వల్లనే కృష్ణా జలాశయాలను తెలంగాణా వినియోగించుకో లేక పోయిందని ఆయన బి.ఆర్.ఎస్ పాలకుల పై మండిపడ్డారు. గత పాలకుల ఉదాసీనతతోటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుని పోయి ప్రయోజనం పొందిందని బి.ఆర్.ఎస్ పాలకులపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుండే న్యాయంగా తెలంగాణాకు రావాల్సిన నీటి వాటా పై గట్టిపట్టు పడుతున్నామన్నారు.అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఇప్పటికే గుర్తించిందని తెలంగాణాకు దక్కాల్సిన నీటి వాటా కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.