త్వరలోనే ఆ సంస్థలు విలీనం, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
త్వరలోనే కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 10 March 2025 4:07 PM IST
త్వరలోనే ఆ సంస్థలు విలీనం, మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ గిడ్డంగి, సహకార, అగ్రోస్, HACA, TGRIC, కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మారుతున్న రైతుల, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి వాటిని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటేనే అవి మనుగడ సాగించగలవని అన్నారు. అదేవిధంగా ఒకే కార్యకలాపాల్ని నిర్వహించే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందని తెలిపారు.
దానికి అనుకుగుణంగా సదరు సంస్థలన్నింటినీ రానున్న సంవత్సరాలలో వారు నిర్వహించే కార్యకలాపాలపై, ఆర్థికస్థితిపై నివేదిక అందిన వెంటనే ఆయా సంస్థల బలోపేతానికి లేదా విలీనానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అంతిమంగా ప్రభుత్వం గాని, ప్రభుత్వ అనుబంధ సంస్థల ముఖ్యోద్ధేశం రైతులకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించడమే అని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు IAS, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేకర్ రెడ్డి IAS, మేనేజింగ్ డైరెక్టర్ Dr K.లక్ష్మీ IAS, ఛైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాములు, అన్నపూర్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.