రైతుబంధు డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతుబంధు అందిందని, ఇంకా కొద్ది మంది మిగిలి ఉన్నారని, వారికి ఈ నెల ఆఖరులోగా సాయం అందిస్తామని తెలిపారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 92 శాతం ఉన్నారని వాటికి రైతుబంధు జమ చేశామని, మిగతా 8 శాతం కూడా పూర్తి చేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో చర్చిస్తున్నామని అన్నారు. ఒకేసారి రుణమాఫీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
వచ్చే పంట సీజన్ నుంచి వరిధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి అందించాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. నిజమైన రైతుల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా అర్హులకు తప్పకుండా రైతుబంధు అందజేస్తామని పేర్కొన్నారు. ఎండాకాలం నేపథ్యంలో తాగునీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూసుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమకు ఏ మాత్రం పోటీ కాదని తుమ్మల తెలిపారు. 12 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలువబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.