రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.7,500 (ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2 లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
బుధవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. గడచిన 5 సంవత్సరాలలో రైతుకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి తెల్ల కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.