తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానతో మామిడి పూత, కాయలు నేల రాలాయి. మొక్కజొన్న, పొట్ట దశలోని వరి పంట నేల వాలిపోయాయి. సాగునీటి సమస్య ఉన్నా ఇన్నాళ్లూ ఏదో రకంగా కాపాడుకున్న పంట అకాల వర్షంతో దెబ్బతిందని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి.. ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. దీనిపై తుది నివేదిక రాగానే మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో పంట నష్టం డబ్బును జమ చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షంతో పంట నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.