మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు.. ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతా
Minister Talasani Srinivas Yadav comments on telugu film industry.తెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై ఎలాంటి
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 1:36 PM ISTతెలంగాణ రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన 'అఖండ', 'పుష్ప'చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుందని అన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే సినిమా టికెట్ల ధరలు పెంచామని మంత్రి గుర్తు చేశారు. అంతేగాకుండా.. థియేటర్లో ఐదో ఆటకు అనుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలని భావిస్తునట్లు చెప్పారు. సినిమాకు కులం, మతం, ప్రాంతాల భేదాలు ఏవీ ఉండవన్నారు. అది వినోదాన్ని అందించే సాధనమే అని చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలోని సమస్యలపై తాము సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తున్నామని మంత్రి చెప్పారు.
హైదరాబాద్ నగరంలో వేలాది మంది సినీ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదని, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు పెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటే మాత్రం పలు నిబంధనలు తప్పమన్నారు. త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడతానని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు.
కాగా.. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఏపీ మంత్రి పేర్ని నాని చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని సినిమా థియేటర్ల సమస్యలపై ఆ రాష్ట్ర మంత్రులతో తాను మాట్లాడతానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.