సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై క్లారిటీ వ‌చ్చేసిందిగా..

Minister Talasani Clarity About Theatres Closing. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై స్ప‌స్ట‌త ఇచ్చారు.

By Medi Samrat  Published on  24 March 2021 2:11 PM IST
సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై క్లారిటీ వ‌చ్చేసిందిగా..

తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ సినిమా థియేట‌ర్ల మూసివేత‌పై స్ప‌స్ట‌త ఇచ్చారు. క‌రోనా కేసుల పెరుగుతున్న‌ నేప‌థ్యంలో తెలంగాణ‌లో థియేట‌ర్లు మూసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను మంత్రి ఖండించారు. రాష్ట్రంలో సినిమా థియేట‌ర్ల‌ను మూసివేయ‌డం లేద‌ని.. మూసివేస్తార‌న్న ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అని తేల్చిచెప్పారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌తో సినిమా థియేట‌ర్లు న‌డుస్తాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ, విధిగా మాస్కు ధ‌రించి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఇదిలావుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది‌. వైద్య కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రకటన చేశారు. అయితే ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రం యథావిధంగా కొనసాగుతాయని అన్నారు. విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నేఫ‌థ్యంలోనే థియేట‌ర్లు కూడా మూసివేస్తార‌ని వార్తలు వ‌స్తున్నాయి.


Next Story