ఏ మొహం పెట్టుకుని ప్ర‌ధాని మోదీ పాలమూరు వస్తున్నారు.? : మంత్రి ఫైర్‌

ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

By Medi Samrat  Published on  30 Sept 2023 2:10 PM IST
ఏ మొహం పెట్టుకుని ప్ర‌ధాని మోదీ పాలమూరు వస్తున్నారు.? : మంత్రి ఫైర్‌

ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని ఏ మొఖం పెట్టుకుని రేపు పాలమూరుకు వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో.. అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని ప్ర‌శ్నించారు.

తెలంగాణ డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకుంటాం.. కానీ కృష్ణానదిలో నీటివాట తేల్చాలన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోదీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని అన్నారు. అడ్డదారుల్లో తెలంగాణలో పాగావేయాలని బీజేపీ చూస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తోందని విమ‌ర్శించారు.

Next Story