బండి సంజయ్ చేసిన రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చాయా.? అని ప్రశ్నించారు. మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకి వస్తున్నాయని.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నామన్నారు.
నరేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు చేసిన కృషి అందరూ చూశారు.. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ సింగ్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని.? అని ప్రశ్నించారు. తనకి బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం ఇచ్చిందని రవీందర్ సింగ్ అన్నాడు.. బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ నిలబడిందన్నారు.