హైదరాబాద్: ఈ నెల 19వ తేదీన మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ సహా ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. మళ్లీ పెట్టుబడుల కోసమే దావోస్ పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణను త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీ చేయాలనేదే ప్రభుత్వ ఆలోచన, దృక్పథం అని, పెట్టుబడిదారులకు సులువుగా ఉండేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.
గతంలో దావోస్ పర్యటన సందర్భంగా రూ.1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు పెట్టుబడులు పెడతాం అని ప్రకటించిన వాటిలో 60 శాతం గ్రౌండ్ పూర్తయినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే మరోసారి 19న వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్‌కు వెళ్తున్నామని, భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు.