హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం మానసిక ధైర్యాన్ని కల్పిస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. నిన్న శిశువిహార్ సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. టూరిజం ప్లాజాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. చిన్నారులకు స్వయంగా భోజనం తినిపించారు.
ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ముందుగా హైదరాబాద్ నగరంలోని 2,200 మందికి ఈ కార్డులు ఇస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనాథల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఆసరా లేని పిల్లల్ని చేరదీసి, సంరక్షిస్తే నెలకు రూ.4,500 ఇస్తామని ప్రకటించారు. అనాథ పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.