మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik
మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పూజారుల కోరిక మేరకు, భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆదివాసిల సంప్రదాయాలను, పూజారుల ఆలోచనలకు అనుగుణంగా మేడారం ఆధునికరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వారి ఆదేశానుసారం భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని ఆధునికరణ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా, సమ్మక్క సారలమ్మ తల్లుల ధీరత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను తీర్చిదిద్దుతాం. సమ్మక్క సారలమ్మల ప్రధాన గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పరిసరాలను భక్తుల ఆకాంక్షల మేరకు, పూజారుల ఆలోచనల మేరకు విశాలంగా తీర్చిదిద్దుతాం. పూజారుల ఆలోచనలు కనుగుణంగానే మేడారం మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఒక వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునీకరణ పనులకు సంబంధించి ప్లాన్‌ను సిద్ధం చేస్తాం. పూజారుల ఆమోదంతో పనులు ప్రారంభిస్తాం. పనుల ప్రతి దశలో పూజారుల అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాలి. వచ్చే జాతరలోపు చేయాల్సిన పనులను ముందస్తుగా చేపడుతాం. భక్తులు పుణ్య స్నానాలు చేసే జంపన్న వాగు అభివృద్ధి కోసం ఐదు కోట్లు మంజూరు చేశాము. జంపన్న వాగు పనులను వేగవంతం చేయాలి. అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, పూజారులు, భక్తులకు, మీడియా ప్రతినిధులకు మరిన్ని వస్తువులు కల్పించే విధంగా గుడి చుట్టూ ఏర్పాట్లు చేస్తాం. మేడారంలో బస చేసే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాటు చేస్తాం. కుంభమేళాలో భక్తులకు వసతులు కల్పించిన ఏజెన్సీలను సంప్రదించి వారి సలహాలు తీసుకుంటాం...అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.