ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ మంత్రి సబిత
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విచారణకు ఆదేశించారు
By అంజి Published on 1 March 2023 4:44 PM ISTతెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: కళాశాల సిబ్బంది ఒత్తిడి, వేధింపుల కారణంగా మంగళవారం రాత్రి తరగతి గదిలోనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం స్పందించారు. నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి ఆదేశించారు. ఈ విషాద సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను విద్యా మంత్రి ఆదేశించారు.
శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై సాత్విక్ తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి మృతికి కారణమైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్‌ల పేర్లను కూడా పేర్కొన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ.. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కళాశాల, హాస్టల్‌ను యాజమాన్యం మూసివేసి నిరవధిక సెలవులు ప్రకటించింది.
అంతకుముందు తమకు న్యాయం చేయాలని కోరుతూ తల్లిదండ్రులు, విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే సాత్విక్ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల లెక్చరర్లు విద్యార్థులను కొట్టిన వీడియోలను కూడా విద్యార్థులు విడుదల చేశారు. ఏదైనా సమస్యలపై ఫిర్యాదు చేస్తే తమను లక్ష్యంగా చేసుకుని కొట్టారని వారు ఫిర్యాదు చేశారు.
సాత్విక్ తరగతి గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విద్యార్థి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.