పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షా పత్రాలను ఈ ఏడాది నుంచి 11 నుంచి 6 కు కుదించినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో నిర్వహించే టెన్త్ పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు.
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితర అధికారులు పాల్గొన్నారు.