తెలంగాణ హక్కుల కోసం కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ రాశారు

By -  Knakam Karthik
Published on : 10 March 2026 2:28 PM IST

Telangana, Ponnam Prabhakar, KishanReddy, Bandi Sanjay, Central Funds, Telangana Development, Open Letter

తెలంగాణ హక్కుల కోసం కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ ప్రభుత్వ దయ కాదని, అవి తెలంగాణ ప్రజల హక్కని ఆయన స్పష్టం చేశారు. పన్నులు చెల్లిస్తున్న తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

పార్లమెంట్ బడ్జెట్ చర్చలో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులు గళమెత్తాలని సూచించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని, దానిని తాము వ్యతిరేకించడం లేదని, అయితే అందులో కనీసం సగం నిధులనైనా తెలంగాణకు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడి నిధులు సాధించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు హితవు పలికారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పొన్నం విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో న్యాయం చేయాలని, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటూ రాష్ట్రాలపై భారం మోపడం సరికాదని పేర్కొన్నారు.

ఈ పథకాల్లో కేంద్ర వాటా తిరిగి 90 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లు పదేళ్లుగా నామమాత్రంగానే ఉన్నాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా వాటిని సవరించాలని కోరారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు.హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2 కోసం అవుతున్న $24,000$ కోట్ల వ్యయంలో కేంద్రం 50 శాతం వాటా ఇవ్వాలని, అలాగే మూసీ నది పునరుద్ధరణ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని లేఖలో పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగానికి అనుమతులు ఇవ్వాలని, హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు పూర్తి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

విభజన హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ (ITIR) ప్రాజెక్టుల ఊసే లేదని మండిపడ్డారు. కొత్త జాతీయ రహదారులు, తెలంగాణలో మరో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి, రామప్ప మరియు యాదాద్రి ఆలయాలను నేషనల్ టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని కోరారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వివక్ష చూపుతోందని, ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటులోనూ విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణకు అన్యాయం జరగడం తగదని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story