ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారించాలి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..అని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు

By -  Knakam Karthik
Published on : 13 Nov 2025 1:30 PM IST

Telangana, Hyderabad, Minister Ponnam Prabhakar, TGSRTC

ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారించాలి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం

హైదరాబాద్: ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..అని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహా లక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారు, 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీ కి ప్రభుత్వం చెల్లించింది. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఆర్టీసీ బస్సులు ,బస్ స్టేషన్ లలో & టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు ,వికారాబాద్ , బీహెచ్ఈఎల్ , మియాపూర్ , కుషాయిగూడ , దిల్ సుఖ్ నగర్ , హకీంపేట్ , రాణిగంజ్ , మిథాని తో పలు పలు డిపో లు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశి చారు.

నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఆర్టీసీ మహిళా సంఘాలు ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుంది, ఇప్పటి వరకు 150 బస్సులు మహిళా సంఘాలు ఆర్టీసీ తో సంయుక్తంగా నడుస్తున్నాయి, మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణించారు. ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణిస్తారని అంచనా వేస్తూ 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

Next Story