కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నాం : మంత్రి పొంగులేటి
కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు.
By Medi Samrat Published on 31 Jan 2025 9:15 PM ISTకేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు. ఫాంహౌస్‌లోనే ఉండి మాట్లాడతారా..? లేదా అసెంబ్లీకి వస్తారా? అని ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫాంహౌస్‌కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదు.. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి.. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి.. వర్షాలు వచ్చినా.. వరదలు వచ్చినా కనీసం ప్రజలను పరామర్శించలేదు.. ఫామ్ హౌస్ దాటలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్ననాడు సచివాలయానికి రాలేదు.. ప్రతిపక్ష నేతగా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు.. ప్రజల్లోకి రాలేదు.. కేసీఆర్ జీవితమంతా ఫాంహౌస్‌లోనే అన్నారు.
ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు.. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారన్నారు. ప్రజలన్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్‌కు ఏనాడూ గౌరవం లేదన్నారు.. పదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు ఓడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా కనీసం కృతజ్ఞత తెలపలేదన్నారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కూడా ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది కాలంలో నల్గొండ, కరీంనగర్ బీఆర్ఎస్ సభల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రకటనలే చేశారు. ఆ తర్వాత ఏమయ్యారో అందరికీ తెలిసిందే.. ప్రతిపక్షనేతగా అసెంబ్లీ ముఖం చూడని వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి, నేనున్నానని చెప్పుకోవడానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారన్నారు.
ప్రజలు ఏదో నమ్మి ఓటేశారని అంటున్నావు.. వాస్తవాలు గ్రహించి నీ గడీల పాలన వద్దనుకుని ప్రజలు నిన్ను, నీ కుటుంబాన్ని ఛీత్కరించారు.. పథకాలు అమలు కాలేదని ఫామ్ హౌజ్ లో కూర్చొని మాట్లాడటం కాదు.. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి పదే పదే ఆహ్వానించారు.. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు.. మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదన్నారు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన మీరు.. భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిననాడైన అస్సెంబ్లీకి వస్తారని ఆశించామన్నారు.
నీ ఫాంహౌస్‌కు కరెంటు కోతలెక్కడివి.. లెక్కలు తీద్దామా.. ఏ రోజు ఎంత కరెంటు సరఫరా అయింది.. ఎంత సరఫరా అవుతుందని ప్రశ్నించారు. రైతు భరోసా ఇచ్చిందే మేము.. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్.. చరిత్ర ప్రజలకు తెలియదా..? నీవంటున్న గురుకులాలను సందర్శిద్దామా..? మాతో వస్తారా..? నీవెక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. అద్దె గదుల్లో పెట్టి విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మీరా మాట్లాడేది అని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ కోసం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి కళ్లకు కనిపించడం లేదా..? అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా..? ఏదైనా మాట్లాడితే దానికొక ప్రాతిపదిక ఉండాలన్నారు. ముస్లీంలను కాంగ్రెస్ వాడుకుంది అంటున్నావు.. వాడుకుని వదిలేసే చరిత్ర నీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.