రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ అంటున్నారని.. విజయం సాధించడం కాదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి ఎర్రుపాలెం, మధిరలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రోడ్డు షో నిర్వహించి, ప్రధాన కూడళ్ళలో ప్రసంగించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను విస్మరించారని, కనీసం బాగోగులు కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు కర్ర చేతబట్టి.. కపట నాటకాలు ప్రదర్శిస్తూ బస్సు యాత్ర చేస్తున్నారని.. మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని అన్నారు.
కేసీఆర్ ఫాంహౌస్ మత్తులో ఉండి.. ఇంకా తానే ముఖ్యమంత్రి అని భ్రమలో ఊగుతున్నాడని విమర్శించారు. కపట ప్రేమతో ఖమ్మం వచ్చి ప్రజలతో మాయ మాటలు కలిపే కుట్ర చేస్తున్నాడని.. కేసీఆర్ నోరు తెరిస్తే అదొక డ్రైయినేజీ అని, అడ్డూ అదుపు లేకుండా విమర్శలు చేస్తున్నాడాని అన్నారు. ఎల్లుండి శనివారంతో ప్రచారం ముగుస్తుందని, ప్రజలారా పల్లెల్లో ముమ్మర ప్రచారం చేయాలని, మీరే మంత్రులుగా మరింతగా కృషిచేసి రఘురాం రెడ్డికి భారీ మెజారిటీని అందించాలని కోరారు.
బీజేపీ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి అన్నారు. కోట్లాది రూపాయల నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు తీసుకుని.. నామమాత్రంగా రాష్ట్రానికి నిధులు కేటాయించారని.. మీరు ఏమైనా బిచ్చం వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. రఘురాం రెడ్డి గెలిచాక.. ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్ప్రెస్ ను నిలుపుదామని అన్నారు.