రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు కూస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డితో కలిసి ఓ పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాదిగా హాజరైన నిరుద్యోగ అభ్యర్థులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజలు మార్పు కోరుకుని రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేసుకోమని తెలిపారు. మేం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 45 రోజుల్లోనే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని.. పేపర్ లీకేజీలు లేకుండా నిరుద్యోగుల నమ్మకొన్ని పొందామని అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని రూ.31వేల కోట్లతో అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రభుత్వానికి పేదలు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందని మంత్రి అన్నారు. పోటీ పరీక్షలను రద్దు చేయించి నిరుద్యోగులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ వారు, వారి తొత్తు పార్టీ చూస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. నిరుద్యోగుల భవితవ్యానికి భరోసా కల్పించేలా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మరో వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని అన్నారు. త్వరలోనే జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.