హైదరాబాద్: రేషన్ కార్డుదారులకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానం మాదిరే ఒకరికి 6 కిలోల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. అటు త్వరలో కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు.
ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలనే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాలలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందించాలన్నారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ తప్పనిసరిగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.