హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 లక్షల మంది యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహానిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి విడతగా బహు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ప్రతి పేదవారికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేప్పట్టే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిదని, రాబోయే నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించామని, నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామని మంత్రి తెలిపారు. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇందిరమమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తాయని తెలిపారు.