రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదని, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. లగచర్ల సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే.. రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారు.. అధికారుల మీద దాడి అనేది మన మీద మనం దాడి చేసుకున్నట్లేనన్నారు. రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. కుట్రపూరితంగా అధికారులను రైతులకు దూరం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారన్నారు.
గులాబీ గూండాల కుట్రలను రైతాంగం అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజలను కాపాడుకున్నట్లే, అధికారులను కాపాడుకోలేకపోతే పని చేయడానికి ఏ అధికారి ముందుకు వస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వెలగబెట్టిననాడు ఇదే పద్దతిన చేశారా.? అని ప్రశ్నించారు. ఏం తప్పుచేశారని ఆనాడు ఖమ్మంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారన్నారు. మల్లన్నసాగర్‌లో రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించారు. పిల్లా, పాపా, ముసలి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగతి మరిచారా.? ఎగిసి ఎగిసి పడుతున్న కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులకు బేడీలు వేసిన సంగతి మరిచిపోయారా? లగచర్లలో ఆ పరిస్ధితి లేదు కదా.? అని ప్రశ్నల వర్షం కురిపించారు.