మంత్రి మల్లారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేఫథ్యంలో మంత్రి మల్లారెడ్డి రేవంత్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎంపీ అయినప్పటి నుంచి నన్ను రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి నా కాలేజీలన్నీ మూయిస్తానని ఛాలెంజ్ చేశాడని.. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అప్పట్లో చంద్రబాబుకు కూడా చెప్పానని మల్లారెడ్డి తెలిపారు. పేద ప్రజల కోసం నేను ఆస్పత్రి కడితే ప్రభుత్వ భూమి కబ్జా చేశానని ఆరోపించాడని.. అన్ని అనుమతులతోనే ఆస్పత్రిని నిర్మించినట్లు మంత్రి స్పష్టం చేశారు. తన కళాశాలలు, ఆస్పత్రులకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయని.. తన సంస్థలను ఉన్నతంగా నడుపుతున్నట్లు వివరించారు. బట్టకాల్చి పెద్దమనుషుల మీద వేయడమే రేవంత్‌రెడ్డి పనా? అంటూ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి.. నా సవాల్‌ను స్వీకరించలేదని.. ఏవో కొన్ని జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి నేను కబ్జాలు చేసినట్లు అబద్ధాలు చెప్పాడని.. అబద్ధాలతో నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూశాడని మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.