'క్విడ్ ప్రో కో కాక' మ‌రేంటి..? కేటీఆర్ వ‌ర్సెస్‌ కోమ‌టిరెడ్డి ట్విట‌ర్ ఫైట్‌

Minister KTR vs Komatireddy Rajgopalreddy. బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం బీజేపీలో చేరారని

By Medi Samrat  Published on  8 Oct 2022 8:18 PM IST
క్విడ్ ప్రో కో కాక మ‌రేంటి..? కేటీఆర్ వ‌ర్సెస్‌ కోమ‌టిరెడ్డి ట్విట‌ర్ ఫైట్‌

బీజేపీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం బీజేపీలో చేరారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 18000 కోట్ల విలువైన కాంట్రాక్టులను కేంద్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ఇచ్చిందని కేటీఆర్ శుక్రవారం నాడు ట్విట్టర్‌లో ఈ ఆరోపణలు చేశారు. కోమ‌టిరెడ్డి క్విడ్ ప్రొకోకు పాల్ప‌డ్డారంటూ కేటీఆర్ ఆరోపిస్తూ.. ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 6 నెల‌ల క్రితం త‌న కంపెనీకి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కింద‌ని కోమటిరెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఓపెన్ బిడ్డింగ్‌లో పాల్గొన్న త‌న కంపెనీ ఈ కాంట్రాక్టును సాధించింద‌ని అన్నారు. ఆ వీడియోను త‌న ట్వీట్‌కు జ‌త చేసిన కేటీఆర్‌.. రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ద‌క్కినందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరార‌ని తెలిపారు. ఇది క్విడ్ ప్రొకో కాక మ‌రేమిట‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి బాటలో నడవవచ్చని కేటీఆర్ అన్నారు.

కేటీఆర్ ఆరోపణలపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. తన మీద చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని సవాల్ విసిరారు. కల్వకుంట్ల తారకరామారావుకు బహిరంగ సవాల్ విసురుతున్నానని అన్నారు కోమటిరెడ్డి. నీకు 24 గంటల సమయం ఇస్తున్నా.. నాపై చేసిన క్విడ్ ప్రో కో ఆరోపణలు నిజమని నిరూపించు... లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య వాదన మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 8న రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని తమ అభ్యర్థిగా బీజేపీ శనివారం అధికారికంగా ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బరిలోకి దించగా, కాంగ్రెస్‌ పార్టీ పాల్వాయి స్రవంతిని ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్రకటించింది.




Next Story