టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు.. నాకు సంబంధం ఏంటి.? : కేటీఆర్
Minister KTR On TSPSC Paper Leakage Issue. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 28 Jun 2023 2:48 PM ISTతెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రశ్నించగా.. పేపర్ లీకేజీతో నాకేం సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. 13 సార్లు గుజరాత్‌లో పేపర్ లీక్ అయ్యింది. మాట్లాడితే బీజేపీ వాళ్లు ఐటీ మంత్రి రాజీనామా చేయాలని అంటారు. ఐటీ మంత్రి ఏం పని చేస్తాడో జ్ఞానముందా అని ప్రశ్నించారు. ఐటీ మంత్రికి, టీఎస్‌పీఎస్సీ ఏం సంబంధం అని అడిగారు. ఐటీ మంత్రి కంప్యూటర్ ముందు కూర్చుని పేపర్ తయారు చేస్తాడా..? అని ప్రశ్నించారు. గుజరాత్‌లో 13 సార్లు పేపర్ లీక్ అయితే.. ఏ మంత్రి రాజీనామా చేశాడు.. అక్కడ ఐటీ మంత్రి రాజీనామా చేశాడా.. ముఖ్యమంత్రి చేశాడా అని అడిగారు.
TSPSC పేపర్ లీక్ కి నాకేంటి సంబంధం : Minister KTR - TV9 #TSPSC #KTR #TV9Telugu pic.twitter.com/s9XCIDylsL
— TV9 Telugu (@TV9Telugu) June 27, 2023
సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేసిన చరిత్ర ఉంది కదా.? అని అడగగా.. కేటీఆర్ బదులిస్తూ.. ఆయన మంచివాడు.. చాలా గొప్పవాడు.. చేశారు. కానీ ఇక్కడ మేము తప్పు చేయలేదు. మాకు సంబంధం లేనిదన్నారు. బీజేపీ కార్యకర్తలే టీఎస్‌పీఎస్సీ, టెన్త్ ప్రశ్నాపత్రాలు లీక్ చేయించారని అన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేయించి.. ఆ నేరాన్ని మా మీద వేసి.. గవర్నమెంట్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేశారన్నారు. బీజేపీవి చిల్లర రాజకీయాలన్నారు.
గతంలో గ్లోబరీనా అనే సంస్థకు ప్రశ్నాపత్రాల తయారీకి సంబంధించిన పనులు అప్పగించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్స్ తయారీకి సంబంధించి కంప్యూటర్స్ ఆపరేట్ చేసే సాప్ట్‌వేర్ కూడా మీ సన్నిహితులకే అప్పగించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దీనిపై ఏమంటారని ప్రశ్నించగా.. గ్లోబరీనా సంస్థ, టీఎస్‌పీఎస్సీ సాప్ట్‌వేర్ కు సంబంధించి ఎవరూ తనకు తెలియదని అన్నారు. నేను తొమ్మిదేళ్లుగా మంత్రిని.. ఆ పేర్లు కూడా నాకు తెలియవని స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుని కాబట్టి నాపై ఆరోపణలు చేస్తే.. పేపర్లు, టీవీలు ఎక్కువ చూపిస్తాయని ఇలాంటి ఆరోపణలు చేసి ఉండొచ్చని.. ఈ ఆరోపణలపై పరువు నష్టం దావా కూడా వేశానని తెలిపారు.