'9 ఏళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా'.. మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం అందించిన
By అంజి Published on 23 Jun 2023 10:22 AM GMT'9 ఏళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా'.. మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం గుండు సున్నా అని అన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడం లేదన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేకపోయిందన్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం, పారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చల్ ఓ ఆర్‌ఆర్ వరకు మరో స్కై వే నిర్మాణం చెపట్టేందుకు భూములు ఇవ్వాలని రక్షణ శాఖకు అనేక సార్లు విజ్ఞప్తి చేశామని, మరోసారి ఈ విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రక్షణ శాఖ నుంచి రాజీవ్ రహదారి వైపు స్కై వేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి, మేడ్చల్ వైపు మరో 56 ఎకరాల భూమి ఇస్తే.. అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా స్పందించలేదన్నారు. స్కై వేల మాదిరే స్కై వాక్‌ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్.. ఉప్పల్‌లో చేపట్టింది స్కై వాక్ పూర్తయిందని, అదే సమయంలో రక్షణ శాఖ పరిమితుల వలన మెహదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. గోల్కొండ, ఇబ్రహీం బాగ్ లింకు రోడ్ల కోసం అవసరమైన రక్షణ భూమిని కూడా అడిగామని, కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్ఎంసీకి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాల్‌లను నిర్మాణం చేస్తామని కోరామన్నారు. తమ వైపు నుంచి ప్రయత్న లోపం లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని, ఈసారైనా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రేపు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లక్డికపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేశామని, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డిపిఆర్లు కూడా ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. ఎస్ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కానీ రసూల్ పురా వద్ద మూడు నాలుగు ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుందని, ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేదన్నారు. ఈ విషయంలో ఆమిత్ షాను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కలిసి రావాలన్నారు. పటాన్చెరువు నుంచి హయత్ నగర్ దాకా మెట్రో విస్తరణకు కూడా కేంద్రం తమతో కలిసి రావాలన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించలేదని కేటీఆర్ అన్నారు. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. కిషన్ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెలవదని, కిషన్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు.