వాళ్ల‌కి అవకాశం ఇస్తే.. మ‌ళ్లీ తెలంగాణ‌ను ఆంధ్రాలో క‌లిపేస్తారు : మంత్రి కేటీఆర్

Minister KTR Fire on BJP politics in Telangana.భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 10:00 AM GMT
వాళ్ల‌కి అవకాశం ఇస్తే.. మ‌ళ్లీ తెలంగాణ‌ను ఆంధ్రాలో క‌లిపేస్తారు : మంత్రి కేటీఆర్

భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థ‌ల‌ను మోదీ అమ్మేస్తున్నార‌ని మీరు ఓ నాలుగు రోజులు అవ‌కాశం ఇస్తే తెలంగాణ‌ను తీసుకుపోయి మ‌ళ్లీ ఆంధ్రాలో క‌లిపేస్తాడ‌ని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా వ‌ర్ని మండ‌లం సిద్దాపూర్‌లో రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంత‌రం కేటీఆర్ మాట్లాడారు.

దేశ వ్యాప్తంగా 157 వైద్య క‌ళాశాల‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మంజూరు చేస్తే ఒక్క‌టీ కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌లేద‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 87 నవోద‌య పాఠ‌శాల‌లు మంజూరు చేస్తే.. తెలంగాణ‌కు గుండు సున్నా. కొత్తగా 8 ఐఐఎంలు మంజూరైతే తెలంగాణ‌కు గుండు సున్నా. 16 ఐసెర్‌లో ఇస్తే రాష్ట్రానికి ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేదన్నారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టి ఏడేళ్లు దాటుతున్నా తెలంగాణకు ఎలాంటి ప్రాజెక్టులు మంజూరు చేయలేదన్నారు. బీజేపీ నేతలు విషం చిమ్మకుండా విషయాలు మాట్లాడితే బాగుంటుందని మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

తెలంగాణ పుట్ట‌క‌నే ప్ర‌శ్నిస్తున్న స్థితి ప్ర‌ధాని మోదీది. తెలంగాణ పుట్టుక‌ను ప్ర‌శ్నిస్తున్న పార్టీ మ‌న‌కు అవ‌స‌ర‌మా అన్న‌ది ప్ర‌జ‌లు ఆలోచించాలి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర భార‌తానికే ప్ర‌ధాని అనుకుంటా. దేశం కోసం ధ‌ర్మం కోసం అంటారు త‌ప్ప.. దేశానిక ఏం చేస్తారో చెప్ప‌రు అని విమ‌ర్శించారు. గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. జీవితాలు మార్చమంటే జీవిత బీమాను అమ్మేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ‌లో బీజేపీ అవ‌కాశం ఇస్తే మ‌ళ్లీ ఏపీలో క‌లిపేస్తార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

Next Story
Share it