నేను అలా అనలేదు, పూర్తిగా వక్రీకరించారు: మంత్రి సురేఖ

ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు.

By Knakam Karthik
Published on : 16 May 2025 11:41 AM IST

Telangana, Minister Konda Suekha, Congress Government, Brs

నేను అలా అనలేదు, పూర్తిగా వక్రీకరించారు: మంత్రి సురేఖ

తెలంగాణలో కొందరు మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటారని మాట్లాడినట్లు జరుగుతోన్న ప్రచారంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొంత మంది పూర్తిగా వక్రీకరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పని తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యలు తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదు...ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ వీడియో ద్వారా మరిన్ని వివరాలు తెలియజేస్తా..అని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు.

అయితే గురువారం వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాతది కూలగొట్టి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్‌ కూడా నా దృష్టికి తెచ్చారు. ఇందుకు రూ.4.5 కోట్లు ఎక్కడి నుంచి తేవాలో దారీతెన్ను తెలియలేదు. మరి నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్‌ కోసం వస్తాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్‌ చేస్తారు. అప్పుడు వాళ్లతో నేను అన్నా.. మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్‌ ఒకటి డెవలప్‌ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు.. పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి చెప్పారు. చివరకు సీఎ్‌సఆర్‌ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది’’ అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు.

కాగా గతంలోనూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున మాజీ కోడలు సినీ నటి సమంత, నాగచైతన్య విడాకులకు కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన ఫోన్ ట్యాపింగ్ కారణం అని సంచలన కామెంట్స్ చేవారు. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు మంత్రి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆమె అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పారు.

Next Story