దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం రీతిలో యాదగిరిగుట్టకు పేరు తీసుకు వచ్చేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు చట్ట సవరణ చేశామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. టీటీడీకి స్వయంప్రతిపత్తి ఉంటుందని, కానీ యాదగిరిగుట్ట బోర్డు మాత్రం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలీదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని మండిపడ్డారు.
త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న కీలక వ్యక్తులను బయటపెడతామని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణపై మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని, తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించడం సబబే అన్నారు. దీనిపై రాద్దాంతం చేసే బీజేపీ నాయకులు కావాలంటే కేంద్రసంస్థలకు పొట్టిశ్రీరాములు పేరు పెట్టుకోవాలని, అలా చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సూచించారు.