ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. హమీల అమలుపై నేడు రివ్యు చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందని తెలిపారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని మండిపడ్డారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందని వివరించారు.
నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. మేము ప్రజలను ఇలాగే రెచ్చగొడితే మీరు ఫాంహౌస్ దాటకపోయేవారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలు కు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందన్నారు.