'నాకింత‌ విషమిచ్చి చంపేయండి'.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన

తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.

By -  Medi Samrat
Published on : 10 Jan 2026 3:49 PM IST

నాకింత‌ విషమిచ్చి చంపేయండి.. మంత్రి కోమటిరెడ్డి ఆవేదన

తనను టార్గెట్ చేస్తూ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మొన్న, నిన్న, ఈరోజు ఛానల్స్, సోషల్ మీడియాలో మహిళా అధికారుల మీద నల్గొండ మంత్రులు అంటూ ఏవేవో కథనాలు వేస్తున్నారు.. కలెక్టర్లు, ఐఏఎస్ అధికారుల బదిలీలు మార్పులు అన్ని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటాయ‌న్నారు. నల్గొండ సహా ఏ జిల్లాలో మార్పులు చేయాలన్నా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి ఉంటుంద‌న్నారు. అందులో మంత్రుల ప్రమేయం ఉండదని.. తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం దురదృష్టకరం అన్నారు. మ‌హిళ‌లు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అవ‌డ‌మే త‌ప్పా అని ప్ర‌శ్నించారు.

ముఖ్యమంత్రిపైన కూడా ఇంతకంటే ఘోరమైన వీడియోలు చేసారని తాను గ‌తంలో చూశాన‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఓ రైతు బిడ్డ‌గా ప్ర‌జా జీవితంలోకి ఏడు సార్లు తాను ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నాను.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎటువంటి మ‌చ్చ లేకుండా ఉన్నాను. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది.. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని.. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండని వాపోయారు.

Next Story