అందుకే కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు వచ్చారు : మంత్రి జూపల్లి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు.
By - Medi Samrat |
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది.. ఆ పార్టీ ప్రతిష్ట దిగజారింది.. కేటీఆర్, హరీష్ రావులు ఆ పార్టీని కాపాడుకోలేక పోయారన్నారు.
బలహీనమైన, రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వదిలి బయటకు వచ్చారు తప్ప.. పాలమూరు ప్రాజెక్ట్ లపై ప్రేమ కాదు.. గాడిద గుడ్డు కాదన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు.
ఉమ్మడి పాలమూరు ప్రాజెక్ట్ లను గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. కాలువలు పూర్తికాకుండానే - పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. కానీ ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.. 10 ఏండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది అని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేని మీకు ఉన్నట్టుండి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ఏనాడు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడలేదు.. సఖ్యత ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యారని విమర్శించారు.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో అంటకాగి రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తామని చెప్పింది మీరు కాదా? కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా? రాష్ట్ర హక్కులను కాపాడుకునే అవకాశం ఉన్నా ఏనాడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం లేదన్నారు.. అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతోందన్నారు. తెలంగాణ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదు.. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.