వరంగల్ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయి.. కానీ తొలిసారి అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యమని అన్నారు. అవినీతి ఆరోపణల నుంచి డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ సర్కారు కొత్త వ్యూహాలను పన్నుతోంది. వీటిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కుటుంబ పార్టీల వలలో తెలంగాణ కూరుకుపోయిందన్నారు.
ప్రధాని మోదీ చేసిన విమర్శలకు మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ స్పందించారు. ప్రధాని హోదాలో మోడీ అన్ని అబద్దాలే మాట్లాడారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓ పెద్ద దద్దమ్మ.. రాహుల్, మోదీ ఇద్దరూ దొంగలే. దేశం నాశనానికి వీరే కారకులు అని ఆయన అన్నారు. అవినీతికి రారాజులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంటూ విమర్శించారు.ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సర్కార్ పని.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ స్థానం ఇవ్వరని ఆయన అన్నారు. బీజేపీ దుర్మార్గపు పాలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చరమ గీతం పాడబోతున్నారని.. కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని మోదీకి భయం పట్టుకుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.