ఇప్పుడే గిట్లుంటే.. మున్ముందు ఎట్లుంటుందో.. హెచ్చరిస్తున్న వైద్యులు
Meteorologists forecast heat waves for ensuing summer.తెలుగు రాష్ట్రాల్లో వేడి గాలులు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 28 March 2021 10:35 AM GMTతెలుగు రాష్ట్రాలను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. రోజు వారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వేడి గాలులు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలను తట్టుకోవడం కష్టంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడ నీడ దొరికితే అక్కడ సేదతీరుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వారు కొద్దిసేపు చెట్ల నీడన సేదతీరుతూ.. గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వడగాలులు తీవ్రరూపం దాల్చుతున్నాయని.. వీటి ప్రభావంలో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వేసవి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. అటు, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలతో పాటు వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాలులకు కారణమని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీళ్లు తాగుతూ…డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవాలని చెబుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదని, మసాలా పదార్థారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు.