పట్టి పీడిస్తున్న సమస్యలు.. మెదక్ లో ఏమి జరగబోతోంది?
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Nov 2023 5:45 PM ISTపట్టి పీడిస్తున్న సమస్యలు.. మెదక్ లో ఏమి జరగబోతోంది?
మెదక్: ఉద్యోగాల కొరత, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షల నిర్వహణలో వైఫల్యం, మద్యానికి బానిస అవుతున్న యువత, పంటలకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం మెదక్‌ను పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఈ ప్రాంతంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
గట్టి పోటీ:
మెదక్ జిల్లాలో మంచి పేరున్న ఎం.పద్మా దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. సీనియర్ సిటిజన్లు, మధ్య వయస్కులు.. వివిధ BRS పథకాల ప్రయోజనాలను పొందడంలో వారికి చాలా సహాయం చేసిందని ఆమెకు పేరు ఉంది. కోవిడ్-19 సమయంలో సొంతంగా గ్రౌండ్ లెవెల్‌లో పని చేసి.. వైద్య సహాయాన్ని అందించినందున రోహిత్ రావుకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో, ఆపదలో ఉన్న వారికి అతని స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తోంది.
బీజేపీకి చెందిన పి విజయ్ కుమార్ తనదైన ముద్ర వేసేనా?
మహేశ్ కుమార్ అనే హోటల్ వ్యాపారి మాట్లాడుతూ.. మెదక్‌లో చాలా టఫ్ ఫైట్ జరుగుతోంది. ప్రజలు విడిపోయారు. పార్టీని వీడిన రోహిత్‌రావుకు బీఆర్‌ఎస్ విధేయులు మద్దతివ్వడం లేదు. అతనిపై కోపం ఉంది. రోహిత్ రావుకు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మున్సిపల్ కార్పొరేటర్లు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన కోసం పనిచేయడం లేదన్న ఆగ్రహం కాంగ్రెస్ క్యాడర్‌లో ఉంది.
ఆగ్రహించిన కాంగ్రెస్ క్యాడర్:
రోహిత్‌రావుతో కలవలేక కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్‌లోకి మారకముందే మైనంపల్లి రోహిత్‌రావు మెదక్‌లో ఫ్లెక్సీలు వేసి మెదక్ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. అవి పింక్ కారు గుర్తులతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏ లేని కారణంగా ఆయనను వ్యతిరేకించాం. టీపీసీసీ ఆయనను ఎందుకు ఎంపిక చేసిందో మాకు అర్థం కావడం లేదు. మెదక్‌లో గత పదేళ్లుగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు రోహిత్‌రావుకు మద్దతు ఇవ్వడం లేదు.' అని అన్నారు.
ఆగిపోయిన మెదక్ అభివృద్ధి:
మెదక్ అభివృద్ధి చేయకుండా.. ఆ సొమ్మును సిద్దిపేట అభివృద్ధికి వినియోగించడంతో జిల్లా అభివృద్ధి కుంటుపడిందని మెదక్ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా వెనుకబాటుకు కారణమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన మెదక్ చర్చ్‌కు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. అయితే, చర్చి పరిసర ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేవు. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది.
యువతలో కోపం:
ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైంది? అని రైస్ మిల్లర్లతో కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్న యువకుల బృందం ప్రశ్నించింది. “మేము మా చదువులు పూర్తి చేసాము కాని.. గ్రూప్ పరీక్షలు వాయిదా ఎందుకు వేస్తున్నారు?” అని వరికోత సీజన్ లో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న విద్యార్థి బి.యాదయ్య ప్రశ్నించారు.
పెరిగిన మద్యం వినియోగం:
మెదక్ జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడంతో మద్యం వినియోగం పెరిగిపోయిందని మహిళలు వాపోతున్నారు. ఈ కారణంగా ప్రతి నెలా నాలుగు నుంచి ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. కిరాణా దుకాణం యజమాని రేణుకా రాజు మాట్లాడుతూ, “నా చిన్న కొడుకు మద్యానికి బానిస కావడంతో నేను అతడిని కోల్పోయాను. మద్యం సేవించి వాహనం నడిపేవాడు. ప్రభుత్వం మద్యం దుకాణాలకు మద్దతు ఇస్తోంది. సరైన నియంత్రణ లేకుండా పోయింది." అని వాపోయారు. మెదక్‌లోని 6 మండలాలు, 4 గ్రామాల్లో మద్యం షాపులను మూసివేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
ఏయే ప్రయోజనాలు జరుగుతాయి:
మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్లు BRS ప్రభుత్వం అందించే ప్రయోజనాలు మంచివని.. ప్రభుత్వం నిలబడితేనే అవి కూడా కొనసాగుతాయని వాదిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినప్పటికీ, ఈ జిల్లాలో కొంతమంది మాత్రం.. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి స్థానిక మనిషే పదవిలో ఉండాలని కోరుకుంటున్నారు.