ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 27 Feb 2025 9:15 PM IST
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘటన జరిగిన మరుక్షణం నుండే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఆఘమేఘాల మీద ఆర్మీ, నావి లతో పాటు ఎన్.డి.ఆర్.ఎఫ్,ఎస్.డి.ఆర్.ఎఫ్.,జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టారన్నారు. యావత్ భారతదేశంలో జరిగిన ప్రమాద ఘటనలతో పోల్చి చూసినప్పుడు ఇదే అత్యంత క్లిష్టమైన ప్రమాదంగా పరిగణిస్తున్నామన్నారు.
గురువారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్.ఎల్.బి.సి టన్నెల్ సమీపంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ వంశీ కృష్ణలతో కలసి ఆయన రెస్క్యూ టీం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఈ తరహా దుర్గటనలు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను యావత్ భారతదేశంలోనే అపార అనుభవం గడించిన నిపుణులను రంగంలోకి దింపామన్నారు. ఇప్పటికే ఈ తరహా అనుభవం గడించిన 11 ఏజెన్సీలకు చెందిన బలగాలు రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. మరో సారి జియాలజికల్ సర్వేకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది బుధవారం రోజున ఘటనా స్థలికి చేరుకుంటారని ఆయన తెలిపారు.
టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుక రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు.ఘటనా స్థలిలో నీరు లీకేజ్ ఆటంకంగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. నీటి ఉధృతి పెరిగిందని రెస్క్యూ టీం లు పేర్కొంటున్నాయని అయితే యుద్ధప్రాతిపదికన నీళ్లు తోడేందుకు మోటార్లు నిరంతరం పని చేస్తూన్నాయన్నారు. అయినా రెస్క్యూ టీం లు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రెస్క్యూ చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇటువంటి గంభీర పరిణామాలను విపక్షాలు చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ఘటనలో ఏడుగురు మృత్యువాత పడిన సమయంలో నాడు ప్రతిపక్షంలో మేము ఈ తరహా రాజకీయాలు నెరప లేదన్నారు. అంతెందుకు శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ఎనిమిది మంది చనిపోయినప్పుడు మానవీయ కోణంలో స్పందించామే తప్ప రాజకీయాలు చేయలేదన్నారు. జరిగిన సంఘటన దూరదృష్టకరమని ఇటువంటి సమయంలో హుందాగా వ్యహరించాల్సిన విపక్షాలు ఇంతగా దిగజరుతాయని అనుకోలేదన్నారు. నిర్మాణాత్మక సూచనలు, సలహాలు అందించాల్సిన స్థానంలో ఉన్న విపక్షాలు అవగాహన రాహిత్యంతోటే ఆరోపణలకు పునుకుంటున్నాయని ఆయన విమర్శించారు
ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ బి.ఆర్.ఎస్ పాలనలో పదేళ్ల పాటు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. "ఇది ప్రపంచంలోని అతి పొడవైన సొరంగాలలో ఒకటని, 45 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఇంటర్మీడియట్ అవుట్‌లెట్‌లు లేవని వీటిలో 35 కిలోమీటర్లు పూర్తయిందని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే
నల్లగొండ జిల్లా సస్యశ్యామలంగా మారడమే కాకుండా, ఫ్లోరైడ్ బాద నుండి శాశ్వాత విముక్తి లభిస్తుందన్నారు. అటువంటి సమయంలో దురదృష్టవశాత్తు ఈ పరిణామం చోటు చేసుకుందన్నారు. విపక్షాలు ఇప్పటికైనా మానవీయ కోణంలో స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షాలకు హితవుపలికారు.