సంగారెడ్డి జిల్లాలోని ఓ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని గుబ్బ ఫార్మా కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆ ప్లాంట్‌లోని చాలా భాగం దగ్ధమైంది. మంటలు వేగంగా నిల్వ యూనిట్ అంతటా వ్యాపించడంతో, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కోల్డ్ స్టోరేజ్ నుంచి కిలోమీటర్ల వరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
కాగా అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించారు. 300 టన్నుల కెమికల్ లోపల ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు తీవ్రమవడంతో ప్లాంట్ సమీపంలో నివసిస్తున్న ఇటుక బట్టీ కార్మికులు సురక్షితంగా పారిపోయారు. కోల్డ్ స్టోరేజీలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కంపెనీల నుండి వివిధ రకాల ఔషధ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ అగ్నిప్రమాదం కారణంగా ఫ్యాక్టరీ చుట్టుపక్కలకి ఎవ్వరూ రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.