టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంట‌లు

Massive Fire breakes out Warangal TESCO godown.వరంగల్ జిల్లా గీసుకొండ మండ‌లం ధర్మారంలో గ‌ల ప్రభుత్వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 2:38 PM IST
టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంట‌లు

వరంగల్ జిల్లా గీసుకొండ మండ‌లం ధర్మారంలో గ‌ల ప్రభుత్వ టెక్స్‌టైల్‌ గోదాంలో (టెస్కో గోదాం) అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం జ‌రుగ‌గా.. ఇంకా మంట‌లు అదుపులోకి రాలేదు. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి మంట‌లు అదుపులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

కాగా.. సంఘటనా స్థలాన్ని టెక్స్ టైల్ అధికారులు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో గోదాంలోని రూ. 35 కోట్ల విలువైన వస్త్రాలు కాలి బూడిద అయ్యాయ‌ని తెలిపారు. గోదాంలో పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన దుస్తులు, బెడ్ సీట్లు నిల్వ ఉంచారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రత కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో నిల్వలు గోదాంలోనే పేరుకుపోయాయి.

ఈ ఘ‌ట‌న‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ సరఫరా లేని గోదాంలో మంటలు చెలరేగటం ఏంటీ అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందా?ఎవరైనా కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేదా ఎవరైనా సిగిరెట్ కాల్చిపారేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Next Story