బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

Marri Sashidhar Reddy Joins BJP. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ సీనియర్ రాజకీయనేత మర్రి శశిధర్ రెడ్డి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

By Medi Samrat  Published on  25 Nov 2022 12:45 PM GMT
బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ సీనియర్ రాజకీయనేత మర్రి శశిధర్ రెడ్డి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ కార్యక్రమంలో మర్రి శశిధర్ రెడ్డికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలికారు. ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలోకి రావడం సంతోషం కలిగిస్తోందని.. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని తెలిపారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని.. బీజేపీలో ఓ కార్యకర్తగా కృషి చేస్తానని శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వాన్ని కోరుకున్నారని.. కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని.. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని, తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి అని.. కుటుంబ నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం కానీ, తెలంగాణలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి అని తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి వంటి వ్యక్తి పార్టీలో చేరడం బీజేపీకి ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుతాయని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి పాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.


Next Story
Share it