ఎన్ కౌంటర్ పై సంచలన ఆరోపణలు చేసిన మావోయిస్టు నేత జగన్

Maoist Leader Jagan Comments Encounter. తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  25 Oct 2021 12:14 PM GMT
ఎన్ కౌంటర్ పై సంచలన ఆరోపణలు చేసిన మావోయిస్టు నేత జగన్

తెలంగాణ-చత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ములుగు- బీజీపూర్‌ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెంచారు. చనిపోయిన వారిలో ఒకరు వాజేడు, వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ కమాండర్ సుధాకర్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో మరో ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌ లభ్యమయ్యాయి. చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా తెలంగాణ సరిహద్దులోకి ఎంట్రీ అయ్యాడని వార్తల నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులు ఎదురు పడడంతో ఈ కాల్పులు ఘటన చోటుచేసుకుంది.

ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన పేరిట ఒక లేఖ విడుదల అయింది. ఒక ద్రోహి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే ఎన్ కౌంటర్ జరిగిందని.. ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. సామాన్య ప్రజలను తెలంగాణ ప్రభుత్వం చంపుతోందని అన్నారు. తన పాలన చాలా గొప్పగా ఉందని చెప్పుకోవడానికే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని నిర్వహిస్తున్నారని చెప్పారు. కల్లిబొల్లి మాటలు చెపుతూ ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని.. పేదలకు అండగా ఉన్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం... పోడు పేరుతో ఆదివాసీలను మోసం చేస్తున్నమాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించారని జగన్ తెలిపారు.


Next Story