సినీఫ‌క్కీలో చోరి.. బైక్‌పై వచ్చి కాల్పులు జ‌రిపి.. రూ. 43.50 లక్షలు దోచుకెళ్లారు

Man looted of Rs 43.50 lakh at sub-registrar office in Siddipet. సోమవారం సిద్దిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూమి రిజిస్ట్రేషన్ కోసం

By Medi Samrat  Published on  31 Jan 2022 12:35 PM GMT
సినీఫ‌క్కీలో చోరి.. బైక్‌పై వచ్చి కాల్పులు జ‌రిపి.. రూ. 43.50 లక్షలు దోచుకెళ్లారు

సోమవారం సిద్దిపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి నుండి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు 43.50 లక్షల రూపాయలను దోచుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. దొమ్మాట గ్రామానికి చెందిన రియల్టర్, మాజీ సర్పంచ్ నర్సయ్య తన డ్రైవర్‌తో కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. డ్రైవర్ దగ్గర డబ్బులు పెట్టి ఆఫీసులోకి వెళ్లాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు డ్రైవర్‌పై తుపాకీతో కాల్పులు జరిపి నగదును దోచుకెళ్లారు.

సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డికి రూ.64.24 లక్షలకు భూమిని విక్రయించేందుకు నర్సయ్య అంగీకరించాడు. ఇద్దరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకోగా శ్రీధర్ రెడ్డి.. నర్సయ్యకు రూ.43.50 లక్షలు ఇచ్చాడు. నర్సయ్య తన డ్రైవర్ పరశురాం కోసం వేచి ఉండమని కోరుతూ నగదును తన వద్ద ఉంచాడు. నర్సయ్య పార్కింగ్ స్థలం నుంచి వెళ్లిన వెంటనే ఇద్దరు దుండగులు కారు వద్దకు వచ్చి అద్దాలు పగులగొట్టారు. కారు డ్రైవర్‌ వాహనంతో పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారు తుపాకీతో కాల్పులు జరిపి డబ్బుతో పరారయ్యారు. కారు డ్రైవర్ ఎడమ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.

జిల్లా పోలీసు కమిషనర్ శ్వేత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.




Next Story