నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. నేను స్వయంగా ఊరికి వెళ్లి రాత్రి అక్కడే బస చేసి అన్ని విషయాలు గ్రామస్తులతో చర్చించానని తెలిపారు. మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు గ్రామంలో ఆయన ఇంటిలోకి రోడ్డు లేకుండా చేసారని ఆరోపణలు చేయడం పూర్తి అవాస్తవం అన్నారు.
గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆసుపత్రి నిర్మాణం చేశారు. ఆయన ఇంటికి దారి కూడా వదిలేశారు. అయిన కూడా వివాదం లేపుతున్నారన్నారు. వాస్తవాలు చెప్పినా కూడా ఈ రోజు కేటీఆర్ మళ్ళీ అదే విషయాన్ని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఇంటికి దారి లేనట్టు కేటీఆర్ నిరూపిస్తే తాను ఇలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. మాజీ సర్పంచ్ ఇంటికి దారి ఉన్నట్టు నిరూపిస్తా.. కేటీఆర్ సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కేవలం రాజకీయ లబ్ధికోసం కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కేటీఆర్ చేస్తున్న ప్రచారాలకు ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ రాజకీయ లబ్ది కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం.. గ్రామంలో వివాదాలు లేపడం మానేయ్యాలని సూచించారు.