మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 18 Nov 2023 8:46 PM ISTతెలంగాణ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని... ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లారెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలను జారీ చేయాలని పిటిషనర్ అంజిరెడ్డి కోర్టును కోరారు. అయితే మల్లారెడ్డి అఫిడవిట్ పై అంజరెడ్డికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చారని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి ప్రజలలో జోష్ నింపుతున్నారు. 6 లక్షల 37 వేల పైగా ఓటర్లతో రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నియోజకవర్గమైన మేడ్చల్ లో అత్యధికంగా 17 వేల మందికి పైగా కొత్త ఓటర్లు ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి చాముకూర మల్లారెడ్డి మరో సారి పోటీ పడుతున్నారు. BJP అభ్యర్ధి ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి వజ్రేష్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.