ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్, వారిద్దరిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్, వారిద్దరిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు , శ్రవణ్ రావును భారత్‍కు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది. వారిద్దరిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకు, సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది.
వీలైనంత తొందరగా నిందితులను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతోపాటు, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు అంశం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కు సమాచారం అందగానే అమెరికాలో పొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ పంజాగుట్టలో ఫోన్ ట్యాంపింగ్ కేసు నమోదు కాగానే నిందుతులు అమెరికా పారిపోయిన సంగతి తెలిసిందే.
అయితే, ప్రొవిజినల్ అరెస్టును వారు అక్కడి న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిందితుల పిటిషన్‌ను అక్కడి న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడి న్యాయస్థానంలో వారికి ఊరట లభించకపోతే మాత్రం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.